మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి

అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

24, అక్టోబర్ 2012, బుధవారం

ఎంతని కీర్తింతునురా..


అజ్ఞాత వాగ్గేయకారులు పేరిట
 TTD చానల్ లో ఒక ప్రోగ్రాం వచ్చింది..
అందులో 
మా అక్కయ్య 
పుట్టపర్తి నాగపద్మినిని ఆహ్వానించారు

అక్కయ్య మా నాన్న గారి గురించి చక్కగా చెప్పింది

పుట్టపర్తి వారు అష్టాక్షరి మకుటంగా 
సుమారు ఏడు వేల కీర్తనలు వ్రాసారు

అవి కేవలం భక్తిలో తాదాత్మ్యత పొంది 

తనకోసం తానుగా వ్రాసుకున్నవి
తనలోని ప్రతి భావాన్నీ
కోపం 
ప్రేమ
విరహం
తపన
అలక
ఇలా ..

ఆ పరమాత్మతో వ్యక్త పరచుకున్న 

భావ పరంపరలే ఆ కీర్తనలు
అందులో తాను చేసిన తప్పులను 
చేసిన దోషాలను
దాపరికం లేకుండా 
చెప్పుకున్నవే ..

అంతే గాక

సంగీతంలో మంచి ప్రవేశం 
అభిరుచి ప్రేమ వున్న కారణంగా
పుట్టపర్తి వారు ప్రొద్దుటూరులో వున్న రోజులలో

 మైసూరు చౌడప్ప శిష్యులు 

జమాలప్పగారితో కలిసి 
రక రకాల రాగాలలో కృతులు వ్రాయటం 
వానికి సంగీతం నోట్లు వ్రాయటం జరిగింది
జమాలప్ప గారు మంచి వయొలిన్ ఆర్టిస్ట్

అపురూపమైన రాగాలు

 హేజ్జుజ్జి 
ముఖారి 
లతాంగి 
కల్యాణ కేసరి
పుష్పలతిక 
సైంధవి
తరంగిణి
కైకవసి 
ఝంకార ధ్వని 
త్యాగయ్య గారు చాలా వ్రాసారట
ఆ రాగాలలో పుట్టపర్తి వారూ ఎన్నో కృతులు రచించారు 


శుభ పం తు వరాళి - రూపక తాళం 


ఎంతని కీర్తింతునురా ..

యేమో నీ కరుణ  గలుగ..

పంతమేల..? గిరిధర నా పై ..

నీ వాడగాన..

సవసవగా పెద్దలచే చరితంబులు విని నమ్మితి..

భువనావన.. యెపుడో యేమో నీరాక..!!

కనులకు వెన్నేల వడుపున కళలనీను చిరునగవై..

మనసివైరారా ..!శ్యామా ..యిదిగాదు మేర..!!

యమునా తటములయందో.. ఆ రాధామణితోనో..

యేమో నీ పొలకువలూ.. స్వామీఇక వెదుకలేను..

ప్రాణము.. మానము.. మరియభిమానము నీవైపోయీ..

దీనుడనై ..నీ కొరకై.. దినదినమును యెదురుచూచి..

ఆసలు అడియాసలుగా ఆవాసము దుఃఖముగా

యీశా యిక బ్రదుకను..! రావేమీ యష్టాక్షరినిధి..?

18, అక్టోబర్ 2012, గురువారం

లక్ష్మీ నృసిం హ లాలీ
ఇందుగలడందులేడని 

సందేహము వలదు
చక్రి సర్వోపహతుండు
ఎందెందు వెదకి చూచిన
 అందందేగలడు దానవాగ్రణి వింటే

అన్నాడు ప్రహ్లాదుడు

నరసింహా వతారమై 
వుగ్రరూపమై
స్థంభంలోంచీ 
పరమాత్మ ప్రకటమయ్యాడు.

ఓరుగల్లు సామ్రాజ్జాధిపతి

ప్రతాప రుద్రుడు శివభక్తుడు
ప్రతిరోజూ ఒక కొత్త బంగారు శివలింగంతో 
అభిషేకం చేసేవాడు
అది తరువాత బ్రాహ్మణునికి దానం చేసేవాడు

అహోబిల క్షేత్రం మీద వెళుతుండగా తెల్లవారింది

కంసలిని  పిలిచి
త్వరగా ఒక శివలింగం చేసి పట్టుకురమ్మన్నాడు

ఎంతసేపైనా రాడా కంసలివాడు

ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రభూ
ఎంత ప్రయత్నించినా బంగారు పోత పోస్తే 
అది శివలింగం కాకుండా 
నరసిం హ స్వామిగా మారిపోతోంది..
అన్నాడు వణికిపోతూ..

చేసేది లేక 

నరసిం హ స్వామికే అభిషేకం చేసి ధ్యానం చేసాడు 
అపుడు నరసిం హ స్వామి దర్శనమైంది..

ఇదంతా నా క్షేత్రం

 ఇక్కడ నేనే వుంటాను 
నేను వేరు శివుడు వేరు కాదు..
అన్నాడు
అటువంటి వాడు నరసింహు డు..
ఆ నరసింహు నిపై పుట్టపర్తి కనకమ్మ గారికి 
అంటే మా అమ్మకు ఎనలేని ప్రేమ
అంతటి వాడినీ పసివాణ్ణి చేసి జోలపాడిందా తల్లి..తొలి సంతానం పై తల్లి కి ఎంతప్రేమో
మా పెద్దక్కయ్యకు పెండ్లి చేసినప్పుడు.
ఆమె అత్తగారింటి ఇంటిదేవుడు
లక్ష్మీ నరసిం హ స్వామి..
అందుకే అక్కయ్యకోసం 
మురిపెంగా అమ్మ ఈ పాటను వ్రాసింది..రచన : శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు 
గానం : ధర్మరాజు వంశీ ప్రియ 


లక్ష్మీనృసింహ  లాలీ భక్తులను 
లాలించు తండ్రి లాలీ
సూక్ష్మావతార లాలీ చోళంగి
శ్రీనికేతనుడ లాలీ

పట్టుపర్యంకమందు శ్రీదేవి

పట్టుపునుగులు చిలుకగా
అమృతవల్లిని గూడుచూ నరసిమ్హ
అలత దీరగ నుండుమా

అలసివచ్చినవాడవూనరసింహ 

అలపెల్ల దీరగానూ
అలన శ్రె సతి హాసమే పూవులై
అలరారు గళమునందు

ఇరవుగా భూతలమునా నిలువగా

సరసమౌ వసతిలేక
గరుడాద్రి శిఖరి నుండి ఆశ్రితుల
గమనించి బ్రోతువయ్యా

వేదములె కోళ్ళుగానూ మంచమున

నాదిశలె పట్టెలుగను
శ్రీదేవి పానుపుగను భువనంపు
బాధలే మరువవయ్యా..

భక్తులర్పించు పాలు పండ్లును

రక్తితో గ్రహియించుచూ
లోకంపు జాడలరసి ఏకాంత
చిత్తమున దలపోయుమా

వేగిలేచినది మొదలు వేదనల

క్రాగి నవసెడి భక్తులా
బాధలను రూపుమాపి నీవెంతొ
బడలినావయ్య దేవా

తిన్నగా నవ్వెనేమో పెదవిపై

వెన్నెలలె వెల్లిగొనెను
కన్నతండ్రికి నిదురలో మనసులో
ఎన్నెన్ని ఊహలమ్మా

అలివేణులార మీరు కరములను

ఆలవట్టముల బూని
అలసిన నరసిం హు ని  విసరరే
అలక దీరంగ నిపుడూ

సరసంపు మాటలాడి నరహరి

సిరిగూడి నిదురింపగా
అరమోడ్పు కన్నుగవను చూడుడీ
దరహాస మిగురించెను

అభిలార్తి హర నృసింహ

అమృత శ్రీ నారసింహ 
గరుడాద్రి నారసింహ నిదురింప 
కమలాక్ష శ్రీ  నృసింహ

పరమ తారకమైన యీ నరసింహ 

భక్తి గీతము బాడుచూ
నరహరిని కీర్తింపగా వారికా
నృహరి సాయుజ్యయుక్తి..

14, అక్టోబర్ 2012, ఆదివారం

పలుకులకందని వాడా..భావము కలచేవాడా..


స్త్రీ పురుష నపుంసక మూర్తియునుగాక
తిర్యక్ అమర నరాది మూర్తియునుగాక
కర్మ గుణ బేధ సదసత్ ప్రకాశికాక
వెనుక నన్నియు తానగు విభుతలంతు


అతను స్త్రీ కాదు 
పురుషుడు కాదు 
నపుంసకుడూ కాదు

అసలు దానికొక స్వరూపం లేదు
అది 
నిరాకార నిర్గుణ సచ్చిదానంద చైతన్య స్వరూపం
అది తనంత తాను గా 
ఒక రూపం పొందుతుంది

అది స్త్రీ కావచ్చు
పురుషుడూ కావచ్చు 
ఆకృతి కాదు ప్రధానం
లోపల వున్న పరమాత్మ తత్వం

మూర్తి ఆరాధన 
సగుణం నుంచీ నిర్గుణంలోకి వెళ్ళాలి
సాకారమైన మూర్ర్తి ఆరాధన నుంచీ
నిరాకారమైన ఆరాధనలోకి వెళ్ళటం 
సాధనలోని పై మెట్టు

ఇది తెలిసిన మహాపురుషులు
మన శంకర భగవత్పాదులు
రామానుజులు
రమణులు
ఇంకా
ఎందరో...
ఎందరో...
ఆనాటి భక్తీ రంజని లో మకు టా యమాన మైన కృతి 

రచన శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు 
గానం ఆకాశవాణి  బృందం


పలుకుల కందని వాడా
పాపము కలచేవాడా
పరమ సమాధి లయంబున
పలుమరు తోచేవాడా

పురుషుడంచు భావించితె
పొలతిగ నగుపించు వాడా
పొలతియంచు యెంచితె
నిశ్చేతనముగ నెగడెడువాడా

గుణములు కలవాడంటే
గుణమొకటియు లేనివాడా
త్రిగుణంబుల ముసుగులోన
చిక్కియు చిక్కని వాడా

పలురకముల తనువులతో
ఇలపై నిలిచిన వాడా
పలుకులకూ మాటలకును
దక్కని తెరగులవాడా..


నీవనుచు నీవైతినే
పూజ 
పూజామందిరంలో వుండదు
ఇక్కడుంటుంది..
గుండెల్లో
ప్రతి పాపం చేసే టప్పుడు 
ఇక్కడనడుస్తుంది శరణాగతి..
తత్వం తెలిస్తే..

అయిదు జ్ఞానేంద్రియములు
అయిదు కర్మేంద్రియములు
సుఖాన్నివ్వటానికి
దుఃఖాన్నివ్వటానికి
వానికి స్వాతంత్రమేంవుండదు

మనసు రౌతు 
మనసు రహస్యాన్ని ఒకసారి ఆలోచిస్తే 
చిత్రంగా వుంటుంది

దీనికెప్పుడూ సుఖం కావాలి
కన్నుద్వారా
ముక్కు ద్వారా
నాలుకద్వారా
చెవి ద్వారా
స్పర్శద్వారా..
ఇదీ మనసు  ఆట..

మనసు మాట వింటూ వుంటే
సుఖాలు సుఖాలు సుఖాలు
ఇంతే..
ఎందుకాబ్రదుకు..?

ఆ మనసుకు  
తనలోవున్న 
మరో తన ను చూపించే ప్రయత్నం చేయాలి
ఆ తన ను అది మైమరచి పట్టేలా చేయాలి
ముందది వినదు
మొరాయిస్తుంది
నాలుగు రోజులు అలవాటుచేస్తే
పద నామం చెబుదామంటుంది.

అలా..
అలా..
మనసు మననం చేసి చేసి
తనలో వున్న మరో తననే 
చూడడం ప్రారంభిస్తుంది

చూసి చూసి
తనే ఆ లోపలి రూపం తానే అవుతుంది
ఇంద్రియాలేమయ్యాయి..?
మనస్సులోకెళ్ళిపోయాయి..

మనస్సేమయింది ..?
ఈశ్వరుని పాదాల వద్ద నిలబడిపోయింది

బాహ్య పూజ.. అంతః పూజకోసం


ఇదే 
"భ్రమరమ్ము నిరతమ్ము భావించి కీటకము
తానె భ్రమరమ్ముగా తనువు మారటం.."


ఈ పాటలు పాడి పాడి
మా కీటక హృదయాలు 
భ్రమరంగా మారలేదెందుకని ప్రభూ ..?


రచన      : శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు    
పాడినది : పుట్టపర్తి తరులత 


నీవనుచు నీవైతినే
పరమాత్మ
నిను జూచి నీవైతినే

భ్రమరమ్ము నిరతమ్ము భావించి కీటకము
తానె భ్రమరమ్ముగా తనువు మారినయట్లు

నీవనుచు నీవైతినే  పరమాత్మ
నిను జూచి నీవైతినే


ప్రేమ మయజపమాలలో మధురమైన నీ
నామమ్ము సతతమ్ము నీమమున జపియించి


సర్వ సుందర రూప సాకృతి నిరాకార
అనుభవపు ముకురమ్ము నందున్న నా నీడ


7, అక్టోబర్ 2012, ఆదివారం

"చిక్కితివి లేర నాచేత గోపాల.."
కృష్ణావతారంలో ..
నందప్రజలలో ..
గోపకాంతలతో ..
గోపాలురతో ..
గోవులతో ..
కృష్ణుడు మమేకమైపోయాడు

ఇలా ..

ఏ అవతారంలో కూడా 
భగవానుడు కలిసి పోయింది లేదు

భగవద్గీత బోధించిన వాడు

జగద్గురువైనటువంటి వాడు 
సంకల్ప మాత్రంచేత 
రాక్షసులను సం హరించగల వాడు

అటువంటి పరమాత్మ 

ఏమీ తెలియని గోపాలకులతో కలిసిపోయినట్లు ఇంకెక్కడా కనపడడు

కృష్ణ ప్రేమను మీరెంతగా ఆలోచిస్తారో 

అంత కృష్ణునికి దగ్గరవుతారు.
ఎంత కృష్ణునికి దగ్గరవుతారో 
అదే మనకు శ్రీరామ రక్ష 

అందుకే 

మునులు సంసారాలు వదిలేసి 
ప్రపంచాన్ని వదిలి 
కొన్ని వేల సంవత్సరాలు 
తపస్సు చేసినా చిక్కని పరమాత్మను
యశోద రోటికి కట్టివేసింది
గోపకాంతలు 
వెన్న దొంగపై చాడీలు చెప్పడానికి 
తయారుగా వుండేవాళ్ళు ఎప్పుడూ

అందుకే పుట్టపర్తి వారు 

"చిక్కితివి లేర నాచేత గోపాల.."
అని వ్రాసారు
లీలా శుకుడు 
కృష్ణ లీలలను ఎన్ని అనుభవించారో 
అంతగానూ తనివారా అనుభవించారు 
పుట్టపర్తి వారు
ఈ కీర్తన వినండి..


రచన    శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు
గానం    ధర్మరాజు వంశీప్రియ చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..

చిక్కని వెన్నల మె
క్కి గోపికలిండ్ల 
దక్కకయె కనుబ్రాము దళితేంద్ర నీలా ..


చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..

ఆ యశోదకు నోట అఖిల జగములుజూపి
మాయగొలిపిన విభ్రమాచారశీలా..

చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..అష్టాక్షరీ మంత్ర మమర నా ప్రాణమై

ఆ మంత్రమే నీకు హాటకపు బీఠమై..

చిక్కితి వి లేరా నా చేత గోపాల 
చిక్కిచిక్కవటన్న నిక్కులునుతీరా..

5, అక్టోబర్ 2012, శుక్రవారం

నీ పదములె గతి సిధ్ధ గణపతి పాపహరా నిగమాగమ సారా..

మానవుడు మనసుతో సంకల్పించి

చేతితో కార్యాలను చేస్తాడు
సంకల్పం ఆచరణగా మారితే
కార్య సిధ్ధి దానంతట అదే
కలుగుతుంది..
ఈ తత్వానికి ప్రతినిధి గణపతి
సిధ్ధికి అధిపతి 
కాబట్టి సిధ్ధికి భర్త..

చంద్రమా మనసో జాతః

చక్షో స్సూర్యో అజాయత..

చంద్రుడు మనస్సులోంచీ పుట్టాడు.

చంద్రుడు భాద్రపద శుధ్ధ చవితినాడు 
హస్తా నక్ష్త్రంలో వుంటాడు
హస్తకు అధిపతి బుధుడు
బుధ్ధితో ప్రణాళికా రచన చేయాలి
బుధునికి అధిపతి గణపతి
ఈ విధంగా బుధ్ధికీ భర్త అయ్యాడు గణపతి

అందుకే పుట్టపర్తి వారు

నీ పదములే గతి
సిధ్ధ గణపతీ..
అన్నారు..

రచన : సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు 
గానం : ధర్మరాజు వంశీ ప్రియ 

నీ పదములె గతి సిధ్ధ గణపతి 
పాపహరా నిగమాగమ సారా..


నవరత్నములకు కుందన మందము
యువ చకోరికకు చంద్రుడె అందము
భావభవునకు వసంత మందము
మనిషికి హేరంబ ధ్యానమందము


నీ పదములె గతి సిధ్ధ గణపతి 
పాపహరా నిగమాగమ సారా..


ఫల వృక్షము పక్షులకాశ్రయము

పుణ్య నిర్ఝరులె మునుల కాశ్రయము
నేత్ర హీనునకు తోత్రమందము
జాత్ర హీనునకు విఘ్నేశుడందము


నీ పదములె గతి సిధ్ధ గణపతి 
పాపహరా నిగమాగమ సారా..


సతీమ తల్లికి పతియేలుగడ

యతులకు ప్రణవము తోడూనీడ
మతియుతునకు గణపతి యేతోడు
హి తమతులకు అష్టాక్షరి యేడుగడ 


నీ పదములె గతి సిధ్ధ గణపతి 
పాపహరా నిగమాగమ సారా..