మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

26, నవంబర్ 2013, మంగళవారం

రాసము లప్పుడాడిరీ






రాసలీల ఒక మహా యోగం
కృష్ణ మోహితులైన గోపికలు
తమ మనః ప్రాణాలను 
ఆ మదన మోహనునికి ఆరతి పట్టగా..
వారి అత్యుత్తమ ప్రేమావేశమునకు 
ఆనందమందిన పరమాత్మ
తానూ వారి మధ్య 
ప్రతి గోపికకూ ఒక కృష్ణుడై..
రాత్రంతా ఆనంద నటనమాడాడు
గత జన్మ లో మునులూ ఋషులైన వారు
వేల సంవత్శరాలు తపించినా 
కానలేని ఆ పరంధామునితో
ప్రేమ మోహం కామన పెనవేసికొన్న భావనలతో
స్త్రీ రూపాలలో వున్న వారు
కట్టుబాట్లను దేహ పరిమితులను దాటి
ఆ మురళీరవానికి మైమరచి కృష్ణునితో ఆడిపాడారు.

దళాలను కలుపుతున్న పద్మం నడిమిభాగం దిమ్మె
పంకజనేత్రుడు ఆడుతున్నాడా దళాల మధ్య
ఘలు ఘల్లు మంటున్న నూపురాలు 

తాళం వేస్తున్నాయి
ఆ కమ్ర కంకణాల ఝణత్కారం 

యమునలో ప్రతిధ్వనిస్తూంది
ఆ కర్ణకుండలాల కాంతులు 

దిక్కులను కాంతిమయం చేసాయి
ఉన్నాయా లేవా అనేలా ఉన్న వారి నడుములు 

ఆ నల్లనయ్య చిందులకు ప్రతి పలుకలేక తూగాడిపోతున్నాయి
వారి తెల్లని నవ్వులు ముత్యాలు చల్లినట్లు విరిసిపోతున్నాయి
అలసిన వారి చిరుచెమటలకు కాస్త కాస్తగా తడిసి నుదుటికతుక్కుపోయిన ముంగురులు
కొత్త అందాలను జతచేస్తూన్నాయి
కృష్ణుని చేతనున్న వేణువు
 తనకు తానయి 
కమ్మని రాగాలను  తానూ ఆలపించి మురిసింది
ఎలా వుంది రాసలీల
కృష్ణ లీలా హేల


ఈ పాటను 
అయ్య పాడుతుండగా విన్న జ్ఞాపకం వుంది
చేతితో తాళం వేస్తూ వారు పాడుతూ
మనకూ ఆ రాసలీలను అనుభూతం గావించే వారు
అందరు గోపికలతో ఆడుతున్న ఆకృష్ణుని మీరూ చూడండి..


"అంగనా మంగనా మంతరే మాధవవో

 

మాధవం మాధవం చాంతరే చాంగనా''.





రాసము లప్పుడాడిరీ
ఉల్లాసముతో పూబోడులూ

పద్మము నందున్న దిమ్మెగా..
నడుమ పంకజ నేత్రుడు నాడగా..

 రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
 ఘలు ఘలు ఘలుమంచు నూపురా
ములయందు దాళముగుడాగా
కలకలమని మణిమేఖలా
ములను సంగీతమ్ము జోడుగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
గొప్పగ జెక్కిన కొప్పులా
కుసుమాలు దుసికిళ్ళులాడగా
విప్పుగనున్న కుచంబులా
వేడుక పైటలల్లాడగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
కమ్ర కంకణ ఝణత్కారము
యమునగర్భాన ధ్వనించగా
కర్ణకుండల మూలకాంతులూ
క్రమ్మి దిక్కుల నప్పళించగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
ఉన్నవో లేవో యనంగనూ
ఉన్న నడుములు తూగాడగా
కన్నులనల్లని కాంతులూ
కలువల నల్గడ జిమ్మగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
మల్లెపూవుల వంటి నవ్వులూ
తెల్లని ముత్యాలు చల్లగా
మాణిక్యాధరముల రోచులూ
మసలి దాసనములు చల్లగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
అలకలు గుంపులు గ్రమ్ముతూ వింత
యందము మొగముల జేర్చగా
ధకధకధయ్యిమంచునూ జతులూ
తాళమానముల గూడగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
అమృతము లొల్కెడు బల్కులా
అధికముగా స్వేదమొల్కగా
తనకుదానయి కృష్ణువేణువూ
తంద్ర సంగీతమ్ము చిల్కగా

రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..
అష్టాక్షరీ విభుడప్పుడూ
ఆనంద వర్షము గుర్వగా
ఆకాశ వీధులలోపలా
అమరులు మేనులు మర్వగా
రాసము లప్పుడాడిరీ..
ఉల్లాసముతో పూబోడులూ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి